Home వార్తలు జగన్ అక్రమాస్తుల కేసులో సుప్రీం కోర్టులో హెటిరో సంస్థకు బిగ్ షాక్.. సీబీఐ కేసులో కీలక...

జగన్ అక్రమాస్తుల కేసులో సుప్రీం కోర్టులో హెటిరో సంస్థకు బిగ్ షాక్.. సీబీఐ కేసులో కీలక వ్యాఖ్యలు

జగన్ అక్రమాస్తుల కేసులో ప్రముఖ ఫార్మా కంపెనీ హటిరో కు సుప్రీం కోర్టులో బిగ్ షాక్ తగిలింది. తమ పై సీబీఐ కేసు నమోదు చేయడాన్ని హెటిరో సంస్థ సుప్రీం కోర్టులో సవాల్ చేసింది. ఈ కేసును కొట్టివేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరింది. తొలుత కేసు క్వాష్ కోసం సీబీఐ కోర్టు, తెలంగాణ హైకోర్టును హెటిరో ఆశ్రయించగా, ఆ కోర్టులు నిరాకరించడంతో హెటిరో సుప్రీం కోర్టును ఆశ్రయించింది.

హెటిరో పిటిషన్ పై సుప్రీం కోర్టులో జస్టిస్ హృషికేశ్ రాయ్, జస్టిస్ జోసెఫ్ ల నేతృత్వంలోని ధర్మాసనం నేడు విచారణ జరిపింది. హెటిరో సంస్థపై కేసు కొట్టివేయదగినది కాదని ధర్మాసనం స్పష్టం చేసింది. జగన్ సంస్థలో హెటిరో పెట్టుబడులు పెట్టిందనీ, ఆ తర్వాత హెటిరోకు 80 ఎకరాలు కేటాయించారని ధర్మాసనం పేర్కొంది. జగన్ కంపెనీ ప్రారంభించకుండానేరూ.350 ల ప్రీమియంతో హెటిరో షేర్లు కొనుగోలు చేసిందనీ, ఇవన్నీ దాచేస్తే దాగవని ధర్మాసనం పేర్కొంటూ పెట్టుబడులు నూటికి నూరు శాతం సత్యాలని అభిప్రాయపడింది. వీటిపై సీబీఐ పక్కాగా చార్జిషీటు దాఖలు చేసిందనీ, కావున హెటిరో కంపెనీ విచారణ ఎదుర్కోవాల్సిందేనని స్పష్టం చేసింది. హెటిరోపై దాఖలైన కేసు కొట్టివేతకు ధర్మాసనం నిరాకరించింది.

ఈ సందర్భంలో హెటిరో గ్రూపు మొత్తాన్ని ఎఫ్ఐఆర్ లో చేర్చడం సరికాదని ఆ సంస్థ తరపు న్యాయవాది ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. కంపెనీ సిబ్బందిపై కేసు పెట్టాలి కానీ కంపెనీపై కాదని విన్నవించారు. అయితే ఈ వాదనలను సుప్రీం ధర్మాసనం పరిగణలోకి తీసుకోలేదు. హెటిరో సంస్థలు వేసిన పిటిషన్ ను డిస్మిస్ చేసింది.

Exit mobile version