Home వార్తలు ఆముదాలవలస: ఎవరి బలం ఎంత..! వైసీపీలో “స్పీకర్” సెంటిమెంట్ .. మార్పు తప్పదా..!?

ఆముదాలవలస: ఎవరి బలం ఎంత..! వైసీపీలో “స్పీకర్” సెంటిమెంట్ .. మార్పు తప్పదా..!?

శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసలో ఎవరి బలం ఎంత..? వైసీపీ, టీడీపీ పరిస్థితులు ఎలా ఉన్నాయి..? అనే విషయాలను పరిశీలిస్తే .. ఇక్కడ ఎమ్మెల్యేగా స్పీకర్ తమ్మినేని సీతారామ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తమ్మినేని సీతారామ్ ఇదే నియోజకవర్గం నుండి అయిదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. నాలుగు సార్లు టీడీపీ నుండి, ఒక సారి వైసీపీ నుండి ఆయన విజయం సాధించారు. 1983 రాజకీయ రంగ ప్రవేశం చేసిన తమ్మినేని..1983,85లో గెలిచారు. మరల 1994,99 ఎన్నికల్లో గెలిచారు. మంత్రిగానూ బాధ్యతలు నిర్వహించారు. 2019 ఎన్నికల్లో వైసీపీ నుండి గెలిచిన తర్వాత స్పీకర్ అయ్యారు. 1989, 2004, 2009, 2014 ఎన్నికల్లో ఓడిపోయారు. 2009లో ప్రజారాజ్యం పార్టీ నుండి, 2014 ఎన్నికల్లో వైసీపీ నుండి పోటీ చేసి పరాజయం పాలైయ్యారు.

మామ అల్లుళ్ల సవాల్

ఇక్కడ టీడీపీ ఇన్ చార్జిగా కూన రవికుమార్ ఉన్నారు. 2014లో ఎమ్మెల్యే గా గెలిచి ప్రభుత్వ విప్ గా కూడా పని చేశారు. తమ్మినేని సీతారామ్ కు కూన రవికుమార్ మేనల్లుడు. దగ్గర బంధువే. ఇక్కడి రెండు పార్టీల నాయకత్వాలు ఇలా ఉన్నాయి. టీడీపీ ఆవిర్భావం నుండి ఇక్కడ టీడీపీ అయిదు సార్లు గెలవగా, నాలుగు సార్లు సీతారామ్, ఒక సారి రవికుమార్ విజయం సాధించారు. టీడీపీ, వైసీపీ రెండు పార్టీలకు బలమైన నియోజకవర్గంగానే చెప్పుకోవచ్చు. నియోజకవర్గంలో నాలుగు మండలాలు ఉన్నాయి. ఆముదాలవలస పట్టణం, పొందూరు, సరిగుజ్జిలి, బూర్జ మండలాలు ఉన్నాయి. వీటిలో పొందురు మండలం పెద్దది. రాజకీయంగా శాసించగల స్థాయిలో ఈ మండలంలో ఓటు బ్యాంక్ ఉంది.

తమ్మినేనికి టికెట్ ఇచ్చే విషయంలో..?

సామాజికవర్గ పరంగా చూసుకుంటే ఈ నియోజకవర్గంలో కళింగ సామాజిక వర్గం ఓట్లు ఎక్కువ. అదే విధంగా పొనాటి వెలమ, తూర్పు కాపు సామాజిక వర్గ ఓట్లు అధికంగానే ఉంటాయి. తర్వాత శ్రీశయన, ఎస్సీ, ఇతర బీసీ కమ్యూనిటీ ఓట్లు ఉంటాయి. ఆర్యవైశ్య సామాజిక వర్గ ఓట్లు ఎక్కువగా ఉంటాయి. కొంత మేర బ్రాహ్మణ సామాజికవర్గం ఉంది. ఓవరాల్ గా చూసుకుంటే రాజకీయంగా డామినేటింగ్ చేసేది కళింగ (బీసీ) సామాజిక వర్గం. సామాజిక వర్గ సమీకరణాలు ఈ విధంగా ఉండగా, రాజకీయ పరంగా చూసుకుంటే తమ్మినేని సీతారామ్ సీనియర్ నాయకుడు. నాలుగు దశాబ్దాల నుండి రాజకీయాలను చూస్తున్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో ఆయనకు టికెట్ ఇచ్చే విషయంలో వైసీపీ తర్జనభర్జన పడుతున్నట్లుగా సమాచారం. పార్టీ కొత్త అభ్యర్ధిని తీసుకువచ్చే ప్రయత్నం చేస్తొంది.

గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం సమీక్షలో

రీసెంట్ గా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం సమీక్షలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి సరిగ్గా నిర్వహించని జాబితాలో ఈ నియోజకవర్గాన్ని పేర్కొన్నారు. స్పీకర్ తమ్మినేని సీతారామ్ ను శ్రీకాకుళం ఎంపీ స్థానం నుండి పోటీ చేయించాలా లేక పార్టీలో తెరవెనుక కార్యక్రమాలకు వినియోగించుకోవాలా..? అనే విషయాలపై పార్టీ ఆలోచన చేస్తుందని అంటున్నారు. తమ్మినేని, కూన రవికుమార్ మధ్య బంధుత్వం ఉండటంతో ఆరోపణలు వస్తున్నాయి. ఇద్దరూ ఒకటే అన్న అభిప్రాయం అక్కడి రాజకీయ వర్గాల నుండి వినబడుతోంది. అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లో కొత్త పేరు వినబడుతోంది.

టికెట్ ఆశిస్తున్న సువ్వారి

ప్రస్తుతం గ్రంధాలయ సంస్థ చైర్మన్ గా ఉన్న సువ్వారి గాంధీ 2019 ఎన్నికల్లోనే టికెట్ ఆశించారు. జగన్మోహనరెడ్డి పాదయాత్రలో గాంధీ కలిశారు. కొంత పార్టీకి అంతర్గత పనులు చేశారు. పొందూరు మండలంలో కాళింగ సామాజికవర్గంలో మంచి పట్టు ఉన్న సువ్వారి గాంధీ కి అక్కడ మంచి పట్టు ఉంది. ఇంతకు ముందు ఈ మండలం చీపురుపల్లి నియోజకవర్గంలో ఉన్న సమయంలో మంత్రి బొత్స సత్యనారాయణ కు అనుకూలంగా ఉండేవారు. బొత్స సత్యనారాయణ ద్వారా జగన్మోహనరెడ్డిని పరిచయమై 2019లోనే ఆముదాలవలస టికెట్ ఆశించారు. అయితే అప్పుడు తమ్మినేనికి అవకాశం ఇవ్చారు కాబట్టి ఇప్పుడు గాంధీ పేరును పరిశీలిస్తున్నట్లుగా పార్టీలో టాక్. దానికి తోడు పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్ గా ఉన్నారు. ఆ ప్రచారం అలా ఉంటే .. స్వీకర్ తమ్మినేని వర్గం మాత్రం ఆయన కుమారుడుకు అవకాశం కల్పిస్తారని భావిస్తున్నారు.

టికెట్ ఎవరికి ఇస్తారు అనే విషయాలను పక్కన బెడితే .. పార్టీ బలాలు ఎలా ఉన్నాయి, గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయి అనేది పరిశీలిస్తే .. ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కువగానే కనిపిస్తొంది. ఈ నియోజకవర్గంలో రాజకీయ చైతన్యం ఎక్కువ. అదే విధంగా విద్యాధికులూ ఎక్కువే. శ్రీకాకుళం పట్టణానికి ఈ మండలాలు ఆనుకుని ఉండటంతో అర్బన్ ఏరియా మాదిరిగానే ఉంటుంది. అందుకే సాధారణంగా వచ్చే ప్రభుత్వ వ్యతిరేకత ఇక్కడ ఉంది. ఇది తెలుగుదేశం పార్టీకి కలిసి వచ్చే అంశం. పైగా ఇక్కడ టీడీపీకి సంస్థాగత బలం ఎక్కువ.

ఆముదాలవలస, పొందూరు, సరిబుజ్జి మండలాల్లో టీడీపీకి మంచి ఓటు బ్యాంక్ ఉంది. కార్యకర్తల బలం ఉంది. ప్రస్తుతం వైసీపీ, టీడీపీ బలాబలాలు హోరాహోరీగా గా ఉన్నట్లుగానే చెప్పుకోవచ్చు. ఎన్నికల సమయానికి అభ్యర్ధి ఎంపిక, పార్టీల మార్పులను బట్టి కాస్త టీడీపీకి అనుకూలంగా ఉంటుందని అంటున్నారు. అయితే ఇక్కడ జనసేన ప్రభావం గురించి చూస్తే కార్యకర్తలు, పార్టీ అభిమానులు ఉన్నప్పటికీ నాయకత్వ లోపం ఉంది. అందుకే పెద్ద ఎత్తున ఓటింగ్ వచ్చే అవకాశం అయితే లేదు. ఒక వేళ తమ్మినేని సీతారామ్ ను కాదని సువ్వారి గాంధీకి టికెట్ ఇస్తే ఆయన మద్దతు లేకుండా గెలవడం కష్టం. తమ్మినేని అంగీకారంతో టికెట్ మార్పు జరిగితే వైసీపీకి గెలుపు అవకాశం ఉంటుంది కానీ ఆయన వర్గం వ్యతిరేకిస్తే సువ్వారి గాంధీకి టికెట్ ఇచ్చినా ఉపయోగం ఉండదు.గెలుపు కష్టమే అవుతుంది. ఈ క్లిష్టమైన సమస్యను వైసీపీ ఎలా పరిష్కరించుకుంటుందో వేచి చూడాలి.

Exit mobile version