Home వార్తలు ఎంపీ రఘురామకు ఇచ్చిన విచారణ నోటీసులను ఉపసంహరించుకున్న సిట్..?

ఎంపీ రఘురామకు ఇచ్చిన విచారణ నోటీసులను ఉపసంహరించుకున్న సిట్..?

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజుకు సిట్ ఇచ్చిన 41 ఏ సీఆర్పీసీ ఉత్తర్వులను ఉపసంహరించుకుంది. ఇంతకు ముందు ఆయన ఈ రోజు (నవంబర్ 29) విచారణకు హజరు కావాలంటూ సిట్ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో తనకు నోటీసులు రావడంపై రఘురామ విస్మయాన్ని గురి అయ్యారు. నోటీసులు అందిన విషయాన్ని ఆయన దృవీకరించారు. తనతో చాలా మంది ఫోటోలు దిగుతూ ఉంటారనీ, వారెవరో నిందితులు తనతో ఫోటోలు దిగి ఉంటే వాటిని ఆధారంగా చేసుకుని తనపై బురద జల్లుతూ వార్తలు వచ్చాయన్నారు. అయితే ఈ రోజు విచారణకు హజరుకావాల్సిన అవసరం లేదంటూ సిట్ అధికారులు రఘురామకు సమాచారం ఇచ్చారు. ఈ మేరకు ఆయనకు మెయిల్ ద్వారా సిట్ అధికారులు సమాచారం పంపారు. మళ్లీ అవసరమైతే విచారణకు పిలుస్తామని ఆ లేఖలో పేర్కొన్నారు.

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాల వ్యవహారం దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. హైదరాబాద్ మొయినాబాద్ ఫామ్ హౌస్ లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో బేరసారాలు జరిపిన రామచంద్ర భారతి, నందకుమార్, సింహయాజీలను పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం తీవ్ర సంచలనం అయ్యింది. ఈ ముగ్గురు నిందితులు రిమాండ్ లోనే ఉన్నారు. ప్రభుత్వం ఈ కేసు దర్యాప్తునకు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ నేతృత్వంలో ప్రత్యేక విచారణ బృందం (సిట్)ను ఏర్పాటు చేయగా, సిట్ దర్యాప్తును వేగవంతం చేసింది. ఈ కేసులో పలువురికి నోటీసులు జారీ చేస్తూ విచారణ జరుపుతోంది. విచారణకు సంబంధించి కొందరికి నోటీసులు జారీ చేయగా వారు కోర్టులను ఆశ్రయించారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేరళకు చెందిన ఎన్ డీ ఏ నేత తుషార్ సిట్ నోటీసులపై కేరళ హైకోర్టును ఆశ్రయించడం హాట్ టాపిక్ అయ్యింది. ఈ కేసును సీబీఐ అప్పగించాలని కోరుతూ ఆయన కేరళ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

Exit mobile version