Home వార్తలు ‘మా ఇళ్లు మేమే కూలగొట్టించుకున్నాం .. మీ సానుభూతి అవసరం లేదు’ .. ఇప్పటంలో ఫ్లెక్సీల...

‘మా ఇళ్లు మేమే కూలగొట్టించుకున్నాం .. మీ సానుభూతి అవసరం లేదు’ .. ఇప్పటంలో ఫ్లెక్సీల కలకలం

గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో గల ఇప్పటం గ్రామం పేరు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్న సంగతి తెలిసిందే. రోడ్డు విస్తరణ కార్యక్రమంలో భాగంగా గ్రామంలోని 50కిపైగా ఇళ్ల ప్రహగీగోడలను, గదులను అధికారులు ఇటీవల కూల్చివేయగా, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గ్రామాన్ని సందర్శించారు. బాధిత కుటుంబాలను పరామర్శించారు. గ్రామంలోని బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తానని హామీ ఇచ్చారు. ఆ తరువాత బాధిత కుటుంబాలకు లక్ష వంతున ఆర్ధిక సహాయాన్ని ప్రకటించారు. తాజాగా నిన్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా గ్రామంలో పర్యటించి బాధిత కుటుంబాలను పరామర్శించారు. జనసేన ఆవిర్భావ సభకు సహకరించాలన్న కక్షతోనే గ్రామంలో అవసరం లేకపోయినా రోడ్డు విస్తరణ పేరుతో ఇళ్లను కూల్చివేశారంటూ జనసేన నేతలు ఆరోపించారు. ఇదే విషయాన్ని గ్రామంలోని కొందరు బాధిత కుటుంబాలు చెప్పాయి. గ్రామంలో జాతీయ నేతల విగ్రహాలను తొలగించి వైఎస్ఆర్ విగ్రహాలను మాత్రం తొలగించకుండా ఉంచడంపైనా విమర్శలు రావడంతో ఆ రహదారిలో ఉన్న రెండు వైఎస్ఆర్ విగ్రహాలను అధికారులు తొలగించారు.

ఇది ఇలా ఉంటే తాజాగా గ్రామంలో పలు ఇళ్ల ముందు వెలసిన ఫ్లెక్సీలు మరో కొత్త వివాదానికి దారి తీశాయి. “ప్రభుత్వం మా ఇళ్లు ఏమీ కూల్చలేదు. మీ ఎవ్వరి సానుభూతి మాకు అవసరం లేదు. డబ్బులు ఇచ్చి అబద్దాన్ని నిజం చేయాలని ప్రయత్నించవద్దు” అంటూ పలు ఇళ్ల ముందు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పర్యటనల తర్వాత ఈ ఫ్లెక్సీలు వెలవడం హాట్ టాపిక్ అయ్యింది. ప్రహరీలు కూలగొట్టిన ఇళ్లకే ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం విశేషం.

గ్రామంలో తమ పార్టీ ఆవిర్భావ సభకు సహకరించారన్న కక్షతోనే ప్రభుత్వం ఇళ్లను కూల్చివేసిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపిస్తుండగా, కొందరు గ్రామస్తులు ఈ వాదనను తప్పుబడుతున్నారు. గ్రామంలో స్కూలు బస్సులు వచ్చిపోయేందుకు రోడ్ల విస్తరణ చేపట్టాలని తామే ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిని కోరామని పలువురు గ్రామస్తులు చెబుతున్నారు. ఇలా గ్రామంలో రెండు వాదనలు తెరపైకి రావడం, దానికి తోడు తమ ఇళ్ల ముందు పై రంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకోవడంపై సర్వత్రా ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.

Exit mobile version