Home వార్తలు జేసి ప్రభాకరరెడ్డి కంపెనీ ఆస్తులను జప్తు చేసిన ఈడీ

జేసి ప్రభాకరరెడ్డి కంపెనీ ఆస్తులను జప్తు చేసిన ఈడీ

అనంతపురం జిల్లా టీడీపీ నేత, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసి ప్రభాకరరెడ్డికి ఈడీ షాక్ ఇచ్చింది. ఆయన కంపెనీకి చెందిన ఆస్తులను జప్తు చేసింది. బీఎస్ 4 వాహనాల రిజిస్ట్రేషన్ లో అవకతవకలు జరిగినట్లుగా గుర్తించిన ఈడీ ఈ చర్యలు చేపట్టింది. ఈ కుంభకోణంలో జేసి ప్రభాకరరెడ్డి అనుచరుడైన కాంట్రాక్టర్ గోపాల్ రెడ్డి కంపెనీ ఆస్తులను కూడా ఈడీ అటాచ్ చేసింది. దివాకర్ రెడ్డి రోడ్ లైన్స్, ఝటధార ఇండస్ట్రీస్ కు చెందిన రూ.22.10 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసినట్లు ఈడీ తెలిపింది.

సుప్రీం కోర్టు ఉత్తర్వులకు విరుద్దంగా బీఎస్ – 4 వాహనాల రిజిస్ట్రేషన్లు జరిగినట్లుగా ఈడీ వెల్లడించింది. అశోక్ లైలాండ్ నుండి తక్కువ ధరకు వాహనాలు కొనుగోలు చేసి ఏపి, కర్ణాటక, నాగాలాండ్ లో నకిలీ దృవపత్రాలతో రిజిస్ట్రేషన్లు జరిగినట్లుగా వెల్లడించింది ఈడీ. ఈ కేసు దర్యాప్తులో రూ.38.36 కోట్ల మేరకు లావాదేవీలు జరిగినట్లుగా గుర్తించామని పేర్కొన్న ఈడీ.. అశోక్ లైలాండ్ పాత్రపైనా దర్యాప్తు కొనసాగుతోందని తెలిపింది.

Exit mobile version