Home వార్తలు ఓబులాపురం మైనింగ్ కేసులో ఐఏఎస్ శ్రీలక్ష్మి క్లీన్ చిట్

ఓబులాపురం మైనింగ్ కేసులో ఐఏఎస్ శ్రీలక్ష్మి క్లీన్ చిట్

ఒబులాపురం మైనింగ్ కేసులో సీనియర్ ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మికి బిగ్ రిలీఫ్ లభించింది. తెలంగాణ హైకోర్టు ఆమెపై సీబీఐ నమోదు చేసిన అభియోగాలను కొట్టివేసింది. ఈ మేరకు మంగళవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఒఎంసీ కేసులో ఆరవ నిందితురాలిగా శ్రీలక్ష్మి ఉన్నారు. 2004 నుండి 2009 వరకూ శ్రీలక్ష్మి మైనింగ్ శాఖ కు ప్రిన్సిపల్ సెక్రటరీగా పని చేసిన కాలంలో ఓబులాపురం మైనింగ్ లో భారీ ఎత్తున అక్రమాలు జరిగినట్లుగా సీబీఐ కేసు నమోదు చేసింది.

తనను ఈ కేసు నుండి తప్పించాలంటూ వేసిన డిశ్చార్జ్ పిటిషన్ ను సీబీఐ కోర్టు గత నెల 17న కొట్టివేయడంతో శ్రీలక్ష్మి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై తొలుత మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన హైకోర్టు ఇవేళ ఆమెపై ఉన్న అభియోగాలను కొట్టివేసింది. నిర్దోషిగా ప్రకటించింది. ఆమెపై నేరారోపణకు సంబంధించిన సరైన వివరాలను కోర్టుకు సీబీఐ అందించలేకపోవడంతో కోర్టు ఆమెకు క్లీన్ చిట్ ఇచ్చింది. హైకోర్టు నుండి ఇంతకు ముందే మధ్యంతర ఉత్తర్వులు పొందిన కారణంగా ఇటీవల సీబీఐ కోర్టు శ్రీలక్ష్మి మినహా ఇతర నిందితులపై అభియోగాల నమోదు చేసింది.

Exit mobile version