Home విశ్లేషణ Darsi TDP: దర్శి చెవికి టీడీపీ “కమ్మ”లు..! ఎంత మేరకు మెరుస్తాయి..!?

Darsi TDP: దర్శి చెవికి టీడీపీ “కమ్మ”లు..! ఎంత మేరకు మెరుస్తాయి..!?

Darsi TDP: New Strategy How Would Work..?
Darsi TDP: New Strategy How Would Work..?

Darsi TDP: జిల్లాలో వైసీపీ ద్వంద్వ నాయకత్వాలతో కలహాలు పడుతున్న నియోజకవర్గాల్లో.. టీడీపీ నాయకత్వ లేమితో తంటాలు పడుతుంది.. అందులో మొదటిది చీరాల, రెండోది దర్శి.. చీరాలలో టీడీపీకి ఇప్పుడప్పుడే ఒక స్థిరమైన నాయకున్ని తీసుకురాలేదు. ఆ నియోజకవర్గాన్ని తట్టుకుని, శ్రేణుల్ని నిలబెట్టగల స్థాయిలో నాయకులు ప్రస్తుతం ఎవరూ లేరు.. అందుకే అక్కడ ముగ్గురు సమన్వయకర్తల పేరుతో ఏదో నడిపిస్తుంది.. ఇక దర్శి నియోజకవర్గానికి మాత్రం నానా తంటాలు పడి, పడి.. వెతికి వెతికి చివరికి పమిడి రమేష్ ని ఇంఛార్జిగా ఖరారు చేసింది. సమన్వయకర్త వేరు, ఇంచార్జి వేరు, పోటీ చేసే అభ్యర్థి వేరు.. ఒక్కోసారి ముగ్గురు ఒక్కరే అవ్వవచ్చు.., ఒక్కోసారి మారవచ్చు. సో.., పమిడి రమేష్ ఆ నియోజకవర్గ బరువు బాధ్యతల్ని మోయాల్సిందే. టికెట్ సంగతి తర్వాత.. ప్రస్తుతానికి అక్కడ ఆయన పని చేయాలి, చేయించాలి. తాత్కాలిక సంతృప్తి కోసం “నీకే టికెట్, బాగా చేసుకో, నువ్వే గెలుస్తావు” అని బాబు గారు సెలవిచ్చినప్పటికీ.., దర్శిలో రానున్న కాలంలో చాలా రాజకీయ మార్పులు జరగనున్నాయి.. అటూ ఇటూ కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి.. రెండు బలమైన శక్తులు హోరాహోరీగా తలపడడానికి ఇప్పటి నుండి క్షేత్రస్థాయిలో వ్యవస్థలను సిద్ధం చేసుకుంటున్నాయి.. ఆ రెండు వ్యవస్థల్లో ఒకరు కచ్చితంగా టీడీపీలోకి రానున్నారు అనేది నూటికి నూరు శాతం నమ్మి తీరాల్సిన అంశం. అందుకే.. ఈ మొత్తం వ్యవహారంలో “పమిడి రమేష్” ఒక పావుగా మిగిలిపోయే అవకాశాలు లేకపోలేదు. పైగా రమేష్ లో బీభత్సమైన “మాస్ ఫాలోయింగూ”.., అందరిని కలుపుకుని రాజకీయం నడిపించగల “చొరవ”.. పార్టీ బలాన్ని పెంచే “థాట్ ప్రాసెస్” కూడా పెద్దగా లేదు..!

Darsi TDP: New Strategy How Would Work..?

Darsi TDP: కమ్మ నాయకత్వం ఎంత మేరకు..!?

దర్శి నియోజకవర్గంలో సామజిక చైతన్యం ఎక్కువ. దాని కంటే ఆర్ధిక చైతన్యం కూడా ఎక్కువ. సామజిక చైతన్యాన్ని, ఆర్ధిక చైతన్యం డామినేట్ చేసే స్థాయిలో ఉంటుంది.. అందుకే.., కేవలం ఈ ఒక్క కారణంతోనే సామాజికానికి సంబంధం లేకుండా శిద్దా రాఘవరావు అనే ఒక ఆర్ధిక శక్తీ దర్శిలో నెగ్గగలిగారు. మరి పమిడి రమేష్ ఆ విధంగా నెగ్గగలరా..!? సామాజికంగా రమేష్ కి కొంత మేర బలం ఉంటె ఉండొచ్చు.., కానీ ఇతర సామాజికవర్గాలతో పోలిస్తే ఈ బలం తక్కువే.

  • దర్శి నియోజకవర్గంలో మొదటి నుండి ఆధిపత్యం రెడ్డి సామజిక వర్గానిది. ఆ తర్వాత కాపు సామాజికవర్గం.. ఓట్లు పరంగా బీసీలు, ఎస్సిలు ఎక్కువగా ఉన్నప్పటికీ.. “పొలిటికల్ డామినేషన్” పరంగా రెడ్డి, కాపు వర్గాలదే ఎక్కువ. కేవలం ముండ్లమూరు, కురిచేడు మండలాల్లోని కొన్ని గ్రామాల్లో మాత్రమే కమ్మ సామాజికవర్గం హవా ఉంటుంది. బీసీ ఓట్లు, ఎస్సి ఓట్లు, రెడ్డి, కాపు ఓట్లు తర్వాత స్థానంలో కమ్మ ఓట్లు ఉంటాయి. అత్యంత సున్నితమైన ఈ అంశాన్ని మరిపించి దర్శిలో నాయకుడిగా తాను నిలదొక్కుకోవడం పమిడి రమేష్ కు అంత ఈజీ కాదు.
  • ఎప్పుడో ఏడాది కిందటే తాను నియోజకవర్గ సమన్వయకర్తగా అక్కడ అడుగుపెట్టినప్పటి నుండీ.. ఆయన వెంట నిలుస్తున్నది కేవలం కమ్మ సామాజికవర్గ నాయకులు మాత్రమే. చాలా ఏళ్లకు దర్శిలో తమ సామాజికవర్గ నాయకుడు వచ్చాడు అనే సంతోషంలో వాళ్ళే జేజేలు కొడుతున్నారు. జెండాలు కడుతున్నారు, బీసీ నేతల్లోనూ కొందరు టీడీపీలో బలమైన నాయకులు ఉన్నప్పటికీ ప్రస్తుతం సైలెంట్ గా ఉంటున్నారు. మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు వర్గానికి కూడా పమిడి రమేష్ రాకపట్ల ఏమాత్రం సమ్మతి లేదు.
  • సామజిక సవాళ్ళను అధిగమించి రమేష్ అక్కడ నాయకుడిగా పార్టీని బలోపేతం చేయడం కత్తిమీదసాము. పోనీ శిద్దా రాఘవరావు వంటి నాయకుడిని ఆదర్శంగా తీసుకుని అందరినీ మచ్చిక చేసుకుని.. ఆర్ధికంగా ఆదుకోవాలన్నా.. తన దగ్గర అంత శక్తి లేకపోవచ్చు.., చివరాఖరికి టికెట్ లేకపోవచ్చు. అందుకే రమేష్ పార్టీని నమ్మి ఆ తరహా రిస్కు చేయలేరు. అంచేత ఇన్నాళ్లు నడుస్తున్నట్టే.. నడిపిస్తున్నట్టే దర్శిలో టీడీపీ అప్పుడప్పుడు జేజేలు, ఫ్లెక్సీలు, జెండాలతో కళకళలాడుతూ.., మిగిలిన సమయాల్లో కాస్త నీరసించాల్సిందే..!
Exit mobile version